4, జూన్ 2009, గురువారం

ఏడవ అధ్యాయము-మొదటి రోజు పారాయణము సమాప్తము

శ్రీ సాయినాథాయ నమః

శ్రీసాయిసచ్చరిత్రము
ఏడవ అధ్యాయము

అద్భుతావతారము; సాయిబాబా వైఖరి; వారి యోగాభ్యాసము; వారి సర్యాంతర్యామిత్వము;
కుష్ఠుభక్తుని సేవ; ఖాపర్డే కుమారుని ప్లేగు; పండరిపురము పోవుట.

అద్భుతావతారము

సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడనుకొన్నచో హిందూమతాచారసంపన్నుడుగ గాన్పించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా యన్న విషయము ఇదమిద్ధముగ యెవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి యుత్సవముజరుపుచుండెను. అదేకాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ యుత్సవ సమయమందు కుస్తీపోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచినవారికి మంచి బహుమతులిచ్చెడివారు. గోకులాష్టమినాడు గోపాల్‌కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్‌ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహఱ్ఱం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిల్పి, కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి. నాలుగు దినములవరకు మసీదులో తాబుతు నుంచుటకు బాబా సమ్మతించి యయిదవనాడు నిస్సంకోచముగ దానిని తామే తీసి వేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకువలె వాది చెవులు కుట్టబడియుండెను. వారు హిందువులన్నచో, సున్‌తీ ని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదునందేల యుండును? మహమ్మదీయుడైనచో ధునియను అగ్నిహొత్రమునేల వెలిగించి యుండువారు? అదియేగాక, తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంటవాయించుట,హొమము చేయుట, భజన, అన్నసంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయమతమునకు అంగీకారముకాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కాము లెట్లూ చేయుచుండేడివారు? వారే తెగవారని యడుగబోయిన వారెల్లరు వారిని సందర్శించిన వేంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది యొక వింతకాదు. ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్యశరణాగతి యొనరించెదరో వారు దేవునితో నైక్యమై పోయెదరు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధములేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజనపళ్లెముళో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కాదు. శ్రీసాయి యవతారుము విశిష్టమైనది; యద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదములచెంత కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగ వర్ణించలేను. ఎవరు వారి పాదములను వమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులనేకమంది సాయిబాబావద్దకు వచ్చెడివారు. బాబా వారితో కలసి నవ్వుచూ, సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ, వారి నాలుకపై 'అల్లామాలిక్' యను మాట యెప్పుడూ నాట్యమాడుచుండెడిది. వరికి వాదవివాదములు గాని, చర్చలుగాని యిష్టము లేదు. అప్పుడప్పుడు కోపము పహించినప్పటికి, వారెల్లప్పుడు శాంతముగాను, సంయమముతోను యుండెడివారు. ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంతతత్త్వమును భోధించుచుండువారు. ఆఖరివరకు బాబా యెవరో ఎవరికి తెలయనేలేదు. వారు ప్రభువులను భిక్షుకులను నొకే రీతిగా అదరించిరి. అందరి యంతరంగములందు గల రహస్యములన్ని బాబా యెరింగెడివారు. బాబా ఆ రహస్యములను వేలిబుచ్చగనే యందరు ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులయినప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికేమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవదేహముతో సంచరించుచున్నప్పటికీ, వారి చర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని జూచిన వారందరు వారు శిరిడిలో వెలగిన భగవంతుడనియే యనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమల నెట్లు వర్ణించగలను?

సాయిబాబా వైఖరి

శిరిడీ గ్రామములో నున్న శని, గణపతి, పార్వతీ - శంకర, గ్రామదేవత, మారుతీ మొదలగు దేవాలయములన్నిటిని తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణరూపముగా వసూలయిన పైకమునంతయు నొక్కొక్కరికి రోజుకొక్కంటిని రూ.50/ -, 20/ -,15/ - ల చొప్పున ఇచ్ఛవచ్చినట్లు పంచిపెట్టెడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతు లగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠువారు కూడ రోగవిముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరచుండెను. ఎటువంటి మందులు పసరులతో పనిలేకుండనే గ్రూడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెని. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలల వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు శిరిడీకి తండోపతండములుగ రాసాగిరి. బాబా ఎల్లప్పుడు ధునికెదురుగా ధ్యానమగ్నులయి కూర్చొనెడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్రవిసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానముచేసేవారు; మరొక్కప్పుడు స్నానము లేకుండానే యుండేవారు. తొలిదినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షిమ్చి ఔషధము లిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగ పని చేయుచుండెడివి. వారు గొప్ప 'హకీం '(వైద్యుడు) యని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి యెఱ్ఱబడెను. శిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతరభక్తు లాతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగ అట్టి రోగులకు అంజనములు,ఆవుపాలు, కర్పూరముతో చేసిన యౌషధములు వైద్యులుపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడిగింజలను నూరి రెండు మాత్రలుగ జేసి, యొక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మదుసటి దినము ఆకట్లను విప్పి నీళ్ళను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టిననూ సున్నితమైన కండ్లు మండనేలేదు ఆటువంటి చిత్రములనేకములు గలవు. కాని, యందు యిదొకటి మాత్రమే చెప్పబడినది.

బాబా యోగాభ్యాసములు

సాయిబాబాకు సకలయోగప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, ఖండయోగము, సమాధి, మున్నగు షడ్విధయోగప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే యిక్కడ వర్ణింపబడినవి.
1.ధౌతి
మసీదుకు చాల దూరమున ఒక మఱ్ఱిచెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి మూడురోజులకొకసారి బాబా యచ్చట్కు పోయి ముఖప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆసవయములో బాబా తన ప్రేవులను బయటికి వెడల గ్రక్కి, వాటిని నేటితో శుభ్రపరచి, ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట శిరిడీలోని కొందరు కండ్లార చూచి చెప్పిరి. మామూలుగ ధౌతియనగా 3 అంగుళముల వెడల్పు 22 1/2 అడుగుల పోడవుగల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు నుండనిచ్చి పమ్మట తీసెదరు, కాని బాబా చేసిన ధౌతి చాల విశిష్టము, అసాధారణమునైనది.

2.ఖండయోగము
బాబా తన శరీరావయవములన్నియు వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచి పెట్టువారు. ఒకనాడొక పెద్దమనిషి మసీదుకు పోయి బాబా యవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూని చేసిరనుకొని గ్రామ మునసబు పద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యారు చేసినవానికి ఆ విషయము గూర్చి కొంచెమైన తెలిసి యుండునని తననే అనుమానించెదరని భయపడి యూరకొనెను. మరుసటిదినమతడు మసీదుకు పోగా, బాబా యెప్పటివలె హాయిగా కూర్చొనియుండుట జూచి యాశ్చర్యపడెను. ముందుదినము తాను చూచిన దంతయు భ్రాంతియనుకొనెను. చిరుప్రాయమునుండి బాబా వివిధ యోగప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి యెవ్వరికిని అంతుబట్టనిది. రోగులవద్దనుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యధార్ధులు వారి యనుగ్రహమువల్ల స్వస్థత పొందిరి. నిస్వార్ధముగ వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్పకీర్తి వచ్చెను. బాబా తమ సొంతముకొరకు ఏమియు చేయక, యితరుల మేలుకొరకే యెల్లప్పుడు పాటుపడేవారు. ఒక్కొక్కడు ఇతరుల వ్యాధిని తమపైవేసికొని ఆ భాధను తామనుభనించేవారు. అటువంటి సంఘటననొకదానిని యీ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్యజ్ఞత, దయార్ధ్రహృదయము విదితమగును.

బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము

1910వ సంవత్సరుము (ఘనత్రయోదశి నాడు, యనగా) దీపావళి పండుగ ముందురోజున బాబా ధునివద్ద కూర్చుండి చలికాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను. కొంతసేపయిన తరువాత హఠాత్తుగ కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్తి, నిశ్చలముగ యుండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని జూచి, వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగ వెనుకకు లాగెను. "దేవా! ఇట్లేల చేసితిర" ని బాబా నడగిరి. (మరేదోలోకములో యుండినట్లుండిన) బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని, "ఇక్కడకు చాలదూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని, కొలిమినూదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. వెంటనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. మాచేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నాకానందము గలుగచేయుచున్న" దని జవాబిచ్చెను

కుష్ఠురోగభక్తుని సేవ

బాబా చెయ్యి కాలెనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలిసికొనిన నానా సాహెబు చాందోర్కరు వెంటనే బొంబాయినుండి డాక్టరు పరమనంద్ యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్యసామగ్రితో సహా హుటాహుటిన శిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా యందుల కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీశిందే యను కుష్ఠురోగి యేదో ఆకువేసి కట్టు కట్టెడివాడు నానా యెంతవేడినను బాబా డాక్టగుగారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరుగారు కూడ అనేకసారులు వేడుకొనిరి. 'అల్లాయే తన వైద్యుడనీ' ,'తమకేమాత్రము బాధలేదనీ', చెప్పుచు, యెటులో డాక్టరుచే చికిత్సచేయించుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతయైన తెరువకుండగనే బొంబాయి తిరిగి వెళ్లిపోయెను. కాని అతనికి యీ మిషతో బాబా దర్శనభాగ్యము లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయను. అందరు సంతోషించిరి. అప్పటికి యింకా ఏమైన నొప్పి మిగిలియుండినదాయను సంగతి యెవరికి తెలియదు. కాని, ప్రతిరోజు ఉదయము భాగోజీ పట్టీలను విప్పి, బాబా చేతిని నేతితో తోమి, తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. మహాసిద్ధపురుషుడయిన బాబాకిదంతయు నిజానికి అవసరములేనప్పటికీ, తన భక్తుడైన భాగోజీ యందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే, భాగోజీ తన సేవాకర్యము మొదలిడువాడు. బాగోజీ గతజన్మయందు చేసిన పాపఫలితముగ యీ జన్మమున కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు, దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతునివలె గాన్పించు నప్పటికి, అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివడు; బాబా సహవాసమును పూర్తిగా ననుభవించినవాడు.

ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి

బాబా విచిత్రలీలలలో నింకొకదానిని వర్ణించెదను. అమరావతి నివాసి యగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి శిరిడిలో కొన్ని దినములుండెను. ఒకనాడు ఖాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. శిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బూటీవాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయెను. గద్గదకంఠముతో తన చిన్నకొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో దయతో మృదువుగ నిట్లెనెను: "ప్రస్తుతము ఆకాశము మబ్బుపట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నియు చెదిరిపోయి, ఆకాశము నిర్మలమగును " అట్లనుచు బాబా కఫ్నీని పై కెత్తి, చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణముగల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచూ, "నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో చూడుము! వారి కష్టములన్నియు నావే!" ఈ మహాద్బుతలీలను జూచిన జనులకు, మహాత్ములు తమ భక్తుల బాధలు తామే యెట్లుస్వీకరింతురో యను విషయము స్పష్టమయ్యెను. మహాత్ముల మనస్సు మైనముకన్న మెత్తనిది, వెన్నవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియు ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగ భావించెదరు.

బాబా పండరి ప్రయాణము!

సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందూరుబారులో మామల్తదారుగా నుండెను. అతనికి పండరీపురుమునకు బదిలీ అయ్యెను. సాయిబాబాయందు అతనికిగల భక్తి యను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోకవైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గోప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను. శిరిడీలో యెవ్వరికి ఉత్తరము వ్రాయన, హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను. ముందుగా శిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి, ఆ తరువాత పండరికి పోవలెననుకొనెను. నానాసాహెబు శిరిడీకి వచ్చు సంగతి యెవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమ్‌గాం చేరుసరికి శిరిడీ మసీదులో కలకలము రేగేను. బాబా మసీదులో కూర్చుండి మహాల్సాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో నిట్లనియెను: "మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు. కనుక ఆనందముగా పాడెదము లెండు!" అందరు కలిసి పాడదొడంగిరి. ఆపాట యొక్క భావమేమన,"నేను పండరి పోవలెను. నేనక్కడనే నివసించవలెను. ఎందుకనగా, అదియే నా ప్రభువు యొక్క ధామము."

అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబసమేతముగ వచ్చి బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసి, తనకు పండరీపురము బదలీయైనదనీ, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి యక్కడుండవలసినదనీ వేడుకొనెను. అటుల బ్రతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా యప్పటికే పండరి పోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది, నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు!

ఏడవ అధ్యాయము
సంపూర్ణము

| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు|
|శుభం భవతు |


మొదటిరోజు పారాయణము సమాప్తము

ఆరవ అధ్యాయము

శ్రీ సాయినాథాయ నమః
శ్రీసాయిసచ్చరిత్రము
ఆరవ అధ్యాయము

గురు కరస్పర్శ ప్రభావము-
శ్రీరామనవమి యుత్సవము - దాని ప్రారంభము, పరిణామము మొదలగునవి -
మసీదు రమ్మతులు.

గురు కరస్పర్శ ప్రభావము


సంసారమను సాగరములో జీవుడనెడి యోడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురువనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నాకండ్ల యెదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు, నాశిరస్సుపై చేయివేసి యాశీర్వదించుచున్నట్లు పొడముచున్నరి. నా మనస్సు సంతోషముతో నిండిపోయి, కండ్లనుండి ప్రేమ పొగి పొరలుచున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడ కాలనట్టి వాసనామయమైన సూక్ష్మశరీరము గురుకరస్పర్శ తగులగనే భస్మమైపోవును; అనేకజన్మార్జిత పాపసంచయము పటాపంచలైపోవును. అధ్యాత్మికసంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడ నెమ్మది పొందును. శ్రీసాయి సుందరరూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును; కన్నుల నుండి అనందాశ్రువులు పొంగిపొరలును; హృదయము భావోద్రేకముతో యుక్కిరిబిక్కిరి యగును. 'నేనే తాన'ను (పరబ్రహ్మస్వరూపమను) స్ఫురణ మేల్కొని, ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. 'నేను నీవు' అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేయును. నేను వేదపురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నాసద్గురుమూర్తియే యడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును; నా సద్గురువైన శ్రీసాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా నా ముందు నిలచి, తన లీలలను తామే వినిపింప జేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీసాయి యాపాదమస్తకను కృష్ణునివలె గాన్పించును. భాగవతమో, ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగ అనిపించును. ఎవరితోనైన సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను యేదైన వ్రాయ తలపెట్టినచో, యొక మాటగాని వాక్యముగాని వ్రాయుటకు రాదు. వారి యాశీర్వాదము లభించిన వేంటనే రచనా ధార యంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని యణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టుజేసి యాశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసినవానికి ధర్మార్ధకామమోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తిమార్గములనెడి నాలుగు త్రోవలు గలవు. అన్నింటిలో భక్తిమార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకుసాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీసాయిబాబా నొక్కివక్కాణించెడివాడు

స్వయసత్తాకమైన బ్రహ్మము, జగత్తును సృష్టించు నాబ్రహ్మము యొక్క శక్తి(మాయ), సృష్టి -- యను యీ మూడింటి గూర్చిన తత్త్వవిచారము చేసి, వాస్తవమునకీ మూడును నొకటియేయని సిద్ధాంతీకరించి, బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదానవాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు:

"నా భక్తుని యింటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే యారాధించువారి యొగక్షేమముల నేను జూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు! నీకేమైన కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములోని కీర్తిప్రతిష్ఠలకై ప్రాకులాడుట మాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచగౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క యాకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని యారాధనకొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఇల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుము. మనసును ధనసంపార్జనము, దేహపోషణ, గృహసంరక్షణము మొ||న విషయముల పట్ల సంచరించకుండ గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మదివహించి, శాంతముగను చింతారహిరముగను యుండును. మనస్సు సరియైన సాంగత్యములో నున్నదనుటకు నిదియే గుర్తు. చంచలమనస్కునకు స్వాస్థ్యము చిక్కదు."

బాబా మాటలుదహరించిన పిమ్మట గ్రంథకర్త శిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. శిరిడీలో జరుగు నుత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల(1925 - పుట 197) పత్రికలో శిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవము గురించి విపులముగ వర్ణింపబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది.

కోపర్‌గాంవ్‌లో గోపాల్‌రావు గుండ్ అనునతడు పోలీసు సర్కిలు ఇన్‌స్పెక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్పభక్తుడు. అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికి సంతానము కలుగలేదు. శ్రీసాయి యాశీర్వచనముచే అతనికొక కొడుకు బుట్టెను. ఆ ఆనందసమయంలో అతనికి శిరిడీలో 'ఉరుసు'* ఉత్సవము నిర్వహించవలెనను ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యాకోతేపాటీలు, దాదాకోతేపాటీలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయిభక్తుల ముందుంచెను. వారంతా దీనికి అమోదించిరి. బాబా యాశీర్వాదమును, అనుమతిని పొందిరి. ఇది 1897 లో జరిగేను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకులకర్ణి(కరణము) దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు.
________________________________________________________________________________________________________
===========================================================================================================================================================================================

*ఉరుసు = సమాధిచెందిన మహమ్మదీయ మహాత్ముల దుర్గాల (సమాధుల) వద్ద యేటేటా భక్తులు జరుపుకొను ఆరాధనోత్సవము.
==========================================================================================================================================================================================
________________________________________________________________________________________________________

కాని బాబా యాశీర్వదించి యుండుటచే, మరల ప్రయత్నించగా వెంటనే యనుమతి వచ్చెను. బాబా సలహా ననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమినాడు జదుపుకొనమనుటలో హిందూ - మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశయము కాబోలు. భవిష్యత్సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును.

ఉత్సవము జరుపుటకు అనుమతయితే వచ్చెనుగాని, యితర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్నగ్రామమైన శిరిడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను. గ్రామమంతటికి రెండు నూతులుండెడివి. ఒకటి యెండాకాలములో నెండిపోవుచుండెను. రెండవదానిలోని నీళ్ళు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా, బాబా ఆ ఉప్పునీటిబావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగ ఆ ఉప్పునీరు మంచినీళ్ళుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరమునుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలినముగ అంగళ్ళు వెలసినవి. కుస్తీపోటీల కొరకేర్పాట్లు చేయబడినవి.

గోపాలరావు గుండున కొక మిత్రుడు గలడు. వాని పేరు దాము అణ్ణాకాసార్. అతనిది అహమద్‌నగరు. అతనికిని ఇద్దరు భార్యలున్నప్పటికి సంతానము లేకుండెను. అతనికి కూడ బాబా యాశీర్వాదముచే పుత్ర సంతానము గలిగెను. ఉత్సవము కొరకు ఒక జండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబు నిమోన్‌కరును ఒక నగిషీజండా తెమ్మని కోరెను. ఈ రెండు జండాలను ఉత్సవముతో తీసికొనిపోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతినిప్పటికిని అవలభించుచున్నారు. బాబా తాము నివసించిన యా మసీదును 'ద్వారకామాయి' యని పిలిచెడివారు.

చందనోత్సవము

సుమారు అయిదేళ్ళ తరువాత ఈ యుత్సవముతోబాటు నింకొక ఉత్సవము కూడ ప్రారంభమయ్యెను. కొరాఃలా గ్రామమునకు చెందిన అమీరుశక్కర్ దలాల్ అను మహామ్మదీయభక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజాభజంత్రీలలో ఉత్సవము సాగించెదరు. ఉత్సవమూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి (నింబారు) లోను, గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి మూడు సంవత్సరములు ఈ యుత్సవమును ఆమీరుశక్కరు నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆసేవను కొనసాగించెను. ఒకేదినమందు పగలు హిందువులచే జండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము యే అఱమరికలు లేక జరుగుచున్నవి.

ఏర్పాట్లు

శిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబాభక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందురు వచ్చి ఈ యుత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఎర్పాట్లన్నియు తాత్యాకోతే పాటీలు చూచుకొనెడివాడు. ఇంటిలోపల చేయవలసినవన్నియు రాధాకృష్ణమాయి యను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయెడిది. ఆమె వారికి కావలసినయేర్పాట్లు చూచుకొనుటయేగాక, ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు, స్వయముగా ఆమె మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను మసీదుగోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసిపట్టియుండెడివి. మండుచున్న ధునితో సహా, మసీదులోని వస్తువులనన్నింటినీ తీసి బయట పెట్టి, మసీదుగోడలను చక్కగా కడిగి వెల్లవేయించుచుండెను. ఆమె ఇదంతయు బాబా(దినము మార్చి దినము) చావడిలో పరుండునప్పుడు చేసెడిది. ఈపనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తిచేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాల ప్రీతి. అందుచేఈ యుత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజనపదార్ధములు, నిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగ వండబడెడివి. అనేకమంది సంపన్నులైన సాయిభక్తులు స్వచ్ఛందముగ పూనుకొని యీ సేవలో పాల్గొనుచుండెడివారు.

ఉరు
సు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము

ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరుకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమినాడు వైభవముగా జరుగుచుండెను. రానురాను అది వృద్ధియగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో యీ ఉత్సవమునకు సంబంధించి నొక మార్పు జరిగెను. శ్రీసాయినాధసగుణోపాసన గ్రంధకర్తయైన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ యనువాడు దాదాసాహబు ఖాపర్డే(అమరావతి)తో కలిసి నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడాలో బసచేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడా వసారాలో పండుకొనియుండెను ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్ కాకామహాజని పూజాపరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగనే భీష్మకు యొక క్రొత్త యాలోచన తట్టెను. వెంటనే కాకామహాజనిని దగ్గరకు పిలిచి అతనితో, "ఉరుసు యుత్సవమును శ్రీరామనవమినాడు చేయుననుటలో భగవదుద్దేశమేదియో యుండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాల ముఖ్యమైన పర్వదినము. కనుక యీ దినమందు రామజన్మోత్సవము యేల జరుపకూడ"దని యడిగెను. కాకామహాజనికి ఆ యాలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా యనుమతి సంపాదించుటకు అయత్తమయ్యిరి. కానీ, భగవస్సంకీర్తన చేయుటకు, అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లన, అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండటచే, అతడే దానిని సంకీర్తన చేయుటకు, కాకామహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన శొంఠి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను. బాబా యనుమతి బొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా, "వాడలో నేమి జరుగుచున్నద"ని మహాజనిని ప్రశ్నించెను. బాబా యడిగిన ప్రశ్నలోని అంతరార్ధమును మహాజని గ్రహించలేక, యేమీ జవాబివ్వక మౌనముగ నుండెను. బాబాయదే ప్రశ్న భీష్మ నడిగెను. అతడు శ్రీరామనవమి యుత్సవము చేయవలయునను తమ యాలోచనను బాబాకు విరరించి,అందులకు బాబా యనుమతి నివ్వవలెనని కోరెను. బాబా వెంటెనే యాశీర్వదించెను. అందరు సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదు నలంకరించిరి. రాధాకృష్ణమాయి యొక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామజన్మోత్సవ వేడుక పారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడే లెండీ నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి, మహాజనిని పిలిపించెను. రామజన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకొనునో లేదో, యేమగునో యని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్లెను. అదియంతయు యేమని, అక్కడ ఊయల యెందుకు కట్టిరని బాబా యతనిని యడిగెను. శ్రీరావనవమి మహొ త్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మశీదులో నుండు భగవంతుని నిర్గుణస్వరూపమును సూచించు 'నింబారు' (గూడు) నుండి రెండు పులమాలలను తీసి, యొకటి మహాజని మెడలో వేసి, యింకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. రామకథాసంకీర్తనము ముగియగానే, బాజాభజంత్రీధ్వనుల మధ్య 'శ్రీరామచంద్రమూర్తికీ జై ' యను జయజయద్వానములు చేయుచూ, పరమోత్సాహముతో అందరూ యొకరిపైనొకరు 'గులాల్ '(ఎఱ్ఱ రంగుపొడి) జల్లుకొనిరి. అంతలో నొక గర్జన వినపడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులలో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలమంది భయముతో పారిపోయిరి. కాని బాబా యొక్క సన్నిహితభక్తులు మాత్రము అవన్నియు తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన యాశీర్వాదములని గ్రహించి కదలక నక్కడనే యుండిరి. శ్రీరామజయంతినాడు రావణుడనే యహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీసాయిరూపములో నున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమేకదా యని భావించిరి. శిరిడీలో ఏదైన క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కోపించుట యొక రివాజు. దీనిని తెలిసినవారు గమ్మున నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ ఆరతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నింకనూ దానియవసరమున్నదనీ, కనుక దానిని విప్పవద్దనీ బాబా యతనిని వారించెను. రామనవమి మదుసటి దినమున జరుపు గోపాలకలోత్సవముతోగాని యుత్సవము పూర్తికాదను విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణజననము నాడు పాటించు 'కాలాహండి' యను ఉత్సవము జరిపిరి. కాలాహండి యనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఊప్పుకారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన యటుకులను భక్తులకు ప్రసాదముగ పంచి పెట్టెదరు. శ్రీకృష్ణపరమాత్ముడు ఈ మాదిరిగనే తన స్నేహితులగు గొల్ల పిల్లవాండ్రకు పంచి పెట్టుచుండెను. ఆ మరుసటిదినము ఇవన్నియు పూర్తియైన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలీవిధముగ జరిగిపోవుచుండగా, పగాటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగ జరిగినవి. ఈవిధముగ ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగ మారెను.

1913 నుండి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు క్రమముగ హెచ్చినవి. చైత్రపాడ్యమినుంచి రాధాకృష్ణమాయి 'నామసప్తాహము' ప్రారంభించు చుండెను. భక్తులందరు వంతులవారీగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడ వేకువఝాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతట జరుగుటచే హరికధాకాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5,6 రోజులు ముందు 'ఆధునిక తుకారామ్' యని పిలువబడు బాలాబువ మాలీ యను సంకీర్తనకారుని కాకామహాజని యాధృచ్ఛికముగ కలియుట తటస్తించినరి. శ్రీరామనవమి వాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని శిరిడీ తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరము కూడా, అనగా 1914లో, తన స్వగ్రామమైన సతారా జిల్లా
బృహద్ సిద్ధకవటె గ్రామములో ప్లేగు వ్యాపించియుండుటచేత బాలబువ సతార్కర్ సంకీరనకార్యక్రమములు లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా యనుమతి పొంది అతడు శిరిడీ వచ్చి, హరికథాసంకీర్తనము చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సం|| లో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి వాడు శిరిడీలో సంకీర్తన చేయు భాధ్యతను శ్రీదాసగణు మహరాజునకు బాబా అప్పగించుట ద్వారా యేటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగ పరిష్కరింపబడెను.
1912 నుండి ఈ యుత్సవము రానురాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు శిరిడీ తేనేత్రుట్టెయనలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీపోటీలో ననేకమంది ప్రముఖ మల్లులు పాల్గొనుచిండిరి. పేదలకు అన్నసంతర్పణ విరివిగ జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శిరిడీ యొక సంస్థానముగ రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రధము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దముము మొ|| నవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడ వచ్చెను. ఇవన్నియు యెంత హెచ్చినప్పటికి సాయిబాబా వీనినేమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై యుండెడివారు. ఈ యుత్సవములో గమనింపవలసిన ముఖ్యవిషయమేమన హిందువులు, మహమ్మదీయులు యెట్టి అరమరికలు లేక కలసిమెలసి ఉత్సవములలో పాలుబంచుకొనెడివారు. ఈనాటి వరకు యొటుకంటి మతకలహములు శిరిడీలో తలెత్తలేదు. మొదట 5000 నుండి 7000 వరుకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగ యా సంఖ్య 75,000కు పెరిగినది. అంతపెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికి ఎన్నడూ అంటువ్యాధులుకాని, అల్లరులుగాని సంభవించలేదు!

మసీదుకు మరమ్మతులు

గోపాలరావుగుండునకు ఇంకొక మంచి యాలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించినవిధముగనే, మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈపని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబు చాందోర్కరుకు ఆ సేవ్ లభించినది రాళ్ళ తాపన కార్యము కాకాసాహేబు దీక్షిత్‌కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబా కిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహాల్సాపతి కల్పించుకొని, యెటులనో బాబా యనుమతిని సాధించెను. బాబా చావడిలోపండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపనచేయుట ముగించిరి. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపుమీద కుర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరములో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాల చిన్నది. సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరచి పై కప్పు వేయదలచెను. రాత్రియంతయు శ్రమపడి స్తంభములు నాటెడివరు. మరుసటిదినము ప్రాతఃకాలముననే బాబా చావడినుండి వచ్చి యది యంతయు జూచి కోపముతో వానిని పీకి పారవైచెడివారు.
ఒకసారి బాబా మిక్కిలి కోపొద్దీపితుడై, నాటిన ఇనుపస్తంభము ను ఒక చేతితో బెకలించుచు, రెండవచేతిలో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా దీసి, యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక గోతిలో పారవైచెను బాబా నేత్రములు నిప్పుకణములవలె వెలుగుచుండెను. ఎవరికిని బాబావైపు చూచుటకుకూడా ధైర్యము చాలకుండెను. అందరు భయకంపితులైరి. బాబా తన జేబులోనుంచి ఒక రూపాయి తీసి యటువైపు విసరెను. అది శుభసమయమందు చేయు యాహుతివలె కనబడెను. తాత్యాకూడ చాల భయపడెను. తాత్యాకేమి జరుగునున్నదో ఎవరికీ ఏమియు తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టునుండి తాత్యాను విడిపించుటకెవ్వరికిని ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠురోగియు బాబా భక్తుడు నగు భాగోజి శిందే కొంచెము ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసివేసెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆజోలికి పోదలచిరో అందరికి యొకే గతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణ్దారుని పిలిపించి, వాని వద్దనుంచి యొక నగిషీ గరీపాగాను కొని, తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకాయన్నట్లు, దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క యీ వింతచర్యను జూచినవారెల్లరు నాశ్చర్యమగ్ములైరి. అంత త్వరలో బాబా కెట్లు కోపము వచ్చెను? ఎందుచేత నీ విధముగ తాత్యాను శిక్షించెను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను? అని యందరు ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలె గూర్చుండి యత్యంత ప్రేపానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని యేది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినపుడెల్ల ఒక్కొక్కటి చెప్పెదను.
ఆరవ అధ్యాయము
సంపూర్ణము

| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు|
|శుభం భవతు |



అయిదవ అధ్యాయము

శ్రీ సాయినాథాయ నమః
శ్రీసాయిసచ్చరిత్రము
అయిదవ అధ్యాయము
చాంద్ పాటీలు పెండ్లి బృందములో కలిసి బాబా తిరిగి శిరిడీ రాక: 'సాయి'యను నామము; ఇతర
యోగులతో సహవాసము; పాదుకల చరిత్ర: మొహియొద్దీన్ తో కుస్తీ; జీవితములో మార్పు;
నీళ్ళను నూనెగా మార్పుట; జవ్హర్ అల్లీ యను కపటగురువు.
పెండ్లివారితో కలసి బాబా తిరిగి శిరిడీకి వచ్చుట

ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహామ్మదీయు దొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుఱ్ఱము తప్పిపోయెను. రెండుమాసములు వెదకినను దానియంతు దొరకకుండెను. అతడు నిరాశచెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదునుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారొక తొమ్మిది మైళ్ళు నడచిన పిమ్మట నొక మామిడిచెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చొనియుండెను. అతడు తలపై టోపీ పొడగైన చొక్కా ధరించియుడెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నిచుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును జూచి, అతనిని బిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి గొనుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుఱ్ఱముదని చంద్ పాటీల్ బదులు చెప్పను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెదకుమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుఱ్ఱమును చూచి మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణమనుజుడు కాడనియు గొప్ప ఔలియా(సిద్ధపురుషుడు) అయియుండవచ్చు ననియు అనుకొనెను. గుఱ్ఱమును దీసికొని ఫకీరువద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చ్చాపీ(గుడ్డ ముక్క) నా నీటితో తడిపి, నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి, తరువాత చాంద్ పాటీలు కందించెను. ఇదంతయు జూచి చాంద్ పాటీలు ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిధిగా రమ్మని చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటిదినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి యచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది శిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నియు చేసికొని పాటీలు శిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లివారితో కలసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్లిరి గాని ఫకీరు మాత్రము శిరిడీలో ఆగి, యచ్చటనే స్థిరముగా నిలిచెను.

ఫకీరుకు 'సాయి' నామ మెట్లు వచ్చెను?

పెండ్లివారు శిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున నున్న భక్త మహల్సాపతిగారి పొలములో నున్న మఱ్ఱిచెట్టు క్రింద బస చేసిరి. ఖండోబామందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్నవారొకరి తరువాత నొకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును జూచి భక్త మహాల్సాపతి, "రండి సాయీ!"యన్ని స్వాగతించెను. తక్కినవారు గూడా ఆయనను 'సాయి' యని పిలువనారంభించిరి. అది మొదలు వారు 'సాయిబాబా' గా ప్రఖ్యాతులైరి.

ఇతరయోగులతో సహవాసము

సాయిబాబా శిరిడీలో నొక మసీదులో నివాస మేర్పరచుకొనిరి. బాబా శిరిడీకిరాక పూర్వమే దేవీదాసు అను యోగి శిరిడీలో ఎన్నోసంవత్సరములనుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను. అతనితో కలసి కొంతకాలము మారుతీ మందిరములోను, చావడిలోను నుండెను. కొంతకాల మొంటరిగా నుండెను. అంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి యచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు జానకీదాసు పోవుచుండెను. అటులనే, పుణతాంబే నుండి యొక వైశ్యయెగి శిరిడీ వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు; పేరు గంగాగీరు. ఒకనాడు, బాబా స్వయముగా కుండలతో నీళ్ళు తెచ్చి పూలచెట్లకు పోయుచుండుట జూచి అతడు శిరిడీ గ్రామస్థులతో నిట్లనెను. "ఈ మణి యిచ్చటుండుటచె శిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయనీనాడు కుండలతో నీళ్ళు మోయుచున్నడు. కాని యితడు సామాన్యమానవుడు కాడు. ఈ నేల నిజముగ పుణ్యము చేసికొనినది. కనుకనే సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొనగలిగెను" ఏవలా గ్రామములో నున్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడొకనాడు శిరిడీ గ్రామనివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి యిట్లనెను. "ఈయన యొక యమూల్యమైన రత్నము. సామాన్యమానవుని వలె గాన్పించునప్పటికిని ఈయన మామూలు రాయివంటివాడు కాదు. ఈయనొక యమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. " ఇట్లనుచు ఆనందనాధుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యౌవ్వనమున జరిగిన సంగతి.

బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు

యౌవనమునందు బాబా తమ తలవెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుడెను. పహిల్వానువలె దుస్తులు వేసికొనెడివారు. శిరిడీకి మూడుమైళ్ళ దూరములో నున్న రహతాకు పోయినప్పుడొకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి, నేలను చదును చేసి, వానిని నాటి, నీళ్లూ పోయుచుండిరి. అనుదినము వామన్ తాత్యా యను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగ బావినుండి నీళ్ళు ఫోయిచుండిరి.అనుదినము వామన్ తాత్యా యను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగ బావినుండి నీళ్లు చేది, ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి, భుజముఫై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలము అ కుండలను వేపచెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వేంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండెడివి. ఇట్లు మూడు సంవత్సరములు గడచెను. సాయిబాబా కృషివలన అచ్చట నొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే యిప్పుడు బాబా సమాధి యున్నది. దానినే సమాధి మందిర మందురు. దానిని దర్శించుట కొరకే యనేకమంది భక్తులు విశేషముగా పోవుచున్నరు.

వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము

అక్కల్‌కోటకర్ మహరాజ్ గారి భక్తుడు భాయికృష్ణజీ అలీబాగ్‌కర్. ఇతడు అక్కల్‌కోటకర్ మహరజ్ గారి చిత్రపటమును పూజించెడివాడు. అతడొకప్పుడు షోలాపూరు జిల్లాలోని
అక్కల్‌కోట గ్రామమునకు పోయి, మహరాజ్ గారి పాదుకలు ర్శించి పూజించవలెనని యనుకొనెను. అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో ఆ మహరాజ్ దర్శననిచ్చి యిట్లు చెప్పెను; "ప్రస్తుతము శిరిడీ నా నివాసస్థలము అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము!" అందుచే, అక్కల్‌కోట పోవలెనను తన నిర్ణయమును మార్చుకొని భాయికృష్ణజీ శిరిడీ చీరి, బాబాను పూజించి, అచ్చటనే ఆరు మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్ధము పాదుకలు చేయించి శ్రావణమాసములో నొక శుభదినమున వేపచెట్టుక్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సం || 1834, శ్రావణ మాసములో (అనగా,క్రీ.శ. 1912 లో) జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీబాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ యను బ్రాహ్మణుడు పాదుకల నిత్యపూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణ్ మేరు నాయక్ నకప్పగించబడినది.

ఈ కధయొక్క పూర్తి వివరములు

ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బి.వి.దేవు బాబాకు గొప్ప భకుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేపచెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నియు సగుణ్‌మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షిత్ ల నుండి సేకరించి, పాదుకల పూర్తి వృత్తాంతము, శ్రీసాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము, మొదటి సంచిక, 25 వ పేజేలో నీరీతిగా ప్రచురించినారు.
1912వ సంవత్సరములో బొంబాయినుండి డాక్టరు రామారావు కొఠారెయను నతడు శిరిడీ వచ్చెను. వానితో బాటుగ అతని కంపౌండర్ ను, మరియు అతని మిత్రుడైన భాయికృష్ణజీ అలీబాగ్‌కర్ అనునతడును వెంటవచ్చిరి. శిరిడీలో వరు
సగుణ్‌మేరు నాయక్ కు జి.కె.దీక్షిత్ కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనునప్పుడు సంభాషణ వశాత్తు, బాబా ప్రప్రధమమున శిరిడీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తవస్సు చేసిన దాని జ్ణాపకార్ధము బాబా పాదుకలు ఆ వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టరు రామారావు కొఠారేకు దెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయికృష్ణజీ మిత్రుడైన కంపౌండర్ సలహానిచ్చెను. అందరును యీ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టరుగారికి ఈ విషయము తెలియపరచిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహరాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను జూపిరి. శ్రీ ఉపాసనీ దానిలో కొన్ని మార్పులను జేసి, పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి, బాబా యోగశక్తిని వేపచెట్టు గొప్పతనమును దెలుపు యీ క్రింది శ్లోకమును కూడ చెక్కించమనిరి;


సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధా స్రావిణం తిక్తమప్యప్రియం తమ్ |
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్||


ఉపాసనీ సలహాల నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి, కంపౌండరు ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమినాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జి.కె.దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరమునుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా యా పాదుకలను స్పృశించి, అవి భగమంతుని పాదుకలని నుడివెను. వానిని వేపచెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని యాదేశించెను. ఆ ముందురోజు బొంబాయి నుండి పాస్తాసేట్ యను పార్సీ భక్తుడొకడు మనియార్డరు ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా యా పైకము పాదుకాప్రతిష్ఠకగు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జి.కె.దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖ్‌డె యను బ్రాహ్మణుడు( నానుమామా పూజారి) పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారె దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టు కంచెకూడ పంపెను. ఈ కంచెయు, పైకప్పును కోపర్‌గాం స్టేషన్ నుండి శిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు సగుణ్‌మేరు నాయక్ ఇచ్చెను. (ప్రస్తుతము జాఖ్‌డె పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు)

మొట్టమొదట భాయికృష్ణజీ,
అక్కల్‌కోటకర్ మహారాజ్ భక్తుడు, 1912 వ సంవత్సరములో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించునప్పుడు అక్కల్‌కోటకర్కు పోవుచు మార్గమధ్యమున శిరిడీయందు దిగెను. బాబ దర్శనము చేసిన తరువాత అక్కల్‌కోట గ్రామమునకు పోవలెనను కొని బాబావద్దకేగి యనుమతి నిమ్మనెను. బాబా యిట్లనెను. "అక్కల్‌కోటలో నేమున్నది? అక్కడకేల పోయెదవు? అక్కడుండే మహరాజ్ ప్రస్తుతమిక్కడనే యున్నారు. వారే నేను." ఇది విని భాయికృష్ణజీ అక్కల్‌కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు శిరిడీ యాత్ర చేసెను.

హేమాడ్ పంతునకీ వివరములు తెలిసియుండవు. తెలిసియున్నచో సచ్చరిత్ర లో వ్రాయుట మానియుండరు.

మొహియొద్దీన్ తంబోలితో కుస్తీ -- జీవితములో మార్పు

శిరిడీ గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియొద్దీన్ తాంబోళి యనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా యోడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు రీతిని మర్చుకొనెను. లంగోటి బిగించుకొని ( ఫకీరులు ధరించు) పొడవాటి చొక్క(కఫ్నీ) ని తొడిగికొని, నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునెడివారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందెడివారు. రాజ్యభోగముకంటె దారిద్ర్యమే మేలని నుడివెడువారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడ కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా యతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయములో "దేహమును దమించి, దేవుని సహవాసము చేయమ'ని యొక యశరీరవాణి యతనికి వినిపించెను. అప్పటినుండి గంగాగీరు సంసారము విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణాతాంబే దగ్గర నది యొడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను.

సాయిబాబా జనులతో కలిసిమెలసి తిరిగెడివారు కారు; ఎవ్వరితోను తమంతటతాము మాట్లాడెడివారు. ఎవరైన యేదైన అడిగిన యాయడిగినదానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో యెక్కువ భాగము వేపచెట్టునీడయందు, అప్పుడప్పుడు యూరవతలనున్న కాలువ యొడ్డునగల తుమ్మచెట్టు నీడన కూర్చొనెడివారు. సాయంకాల మూరకనే కొంతదూరము నడిచెడివారు; ఒక్కొక్కసారి నీమ్‌గాం పోవుచుండెడివారు. నీమ్‌గాంలో బాబాసాహెబ్ త్ర్యంబక్‌జీ డేంగలే యనునతని యింటికి తరుచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగలేయందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు రెండు వివహములు చేసికొన్నను సంతానము కలుగులేదు. బాబాసాహెబు డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబాయనుగ్రాహముచే నానాసాహెబునకు పుత్రసంతానము కలిగెను. అప్పటినుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి యంతటను వెల్లడి యాయెను. అహమద్ నగరు వరకు వ్యాపించెను. అక్కడనుంచి నానాసాహెబు చందోర్కరు, కేశవ్ చిదంబర్ మొదలుగాగల యనేకయంది శిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. రాత్రులందు బాబాపాడుపడిన పాతమశీదునందు శయనించుచుండెను. పొగపీల్చుకొను 'చిలిం' గొట్టము, కొంత పోగాకు, ఒక రేకు డబ్బా, కఫ్నీ, తలగుడ్డ, ఎల్లప్పుడు దగ్గరనుంచుకొను 'సటకా"(చిన్న చేతికర్ర) మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపై నొక గుడ్డను చుట్టి, దాని అంచులను హడవలె మెలిబెట్టి ముడివేసి, యెడమచెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతుకకుండ నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు. (కఫ్నీ క్రింద) లంగోటీ కట్టుకొనెడివారు. చలిని కాచుకొనుటకు ధుని కెదురుగా(మసీదు ఈశాన్యభాగములో గల) కొయ్య చేపట్టుపై తమ యెడమచేతినానించి, దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో ఆహంకారమును, కోరికలను, అలోచనలను ఆహుతి చేసి "అల్లాయే యజమాని" అని పలికేవారు. మసీదులో రెండు గదుల స్థలము మాత్రముండెను. భక్తులందరు అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్నిమార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపన చేసిరి. బాబా యీ మసీదుకు రాకపూర్వము 'తకియా'(రచ్చ) లో చాలాకాలము నివసించిరి. బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు; భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు.

నీళ్లను నూనెగా మార్చుట

సాయిబాబాకు దీపములన్న చాల యిష్టము. ఊరిలో నూనెను విక్రయించు షాహుకార్లను నూనె యడిగి తెచ్చి మసీదునందు రాత్రియంతయు దీపములు వెలిగించు చుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణాదారులందరు కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగానూనె లేదనిరి. బాబాకలత జెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టియుంచెను. నూనెవ్యాపారులు ఆసక్తితో నిదంతయు గమనించు చుండిరి. అడుగున రెండుమూడు నూనెచుక్కలు మిగిలియున్న తమ రేకుడబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట, మరల డబ్బాతో నీరు తీసికోని, యా నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణాదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నియు తెల్లవారుదాక చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు జూచి యా షాహుకార్లు పశ్చాత్తాపపడి, బాబాను మన్నింపు కొరిరి. బాబా వారిని క్షమించి, ఇకపైనైననూ సత్యము నంటివట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి.

జౌహర్ అలీ యను కపటగురువు

పైన వివరించిన కుస్తీ జరిగిన యయిదేండ్ల తరువాత అహమదునగ
రు నుండి జవ్హర్ అల్లీ యను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్రమందిరమునకు సమీపమున నున్న స్థలములో దిగెను. ఆ పకీరు బాగా చదువుకొన్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధురభాషణుడు. ఆ యూరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడి వారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా "ఈద్ గా" యను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్ధించు గోడయే 'ఈద్‌గా'. ఈ విషయములో వివాదములేచి, అది ఘర్షణలకు దారితీసెను. దానితో జవ్హర్ అల్లీ రహతా విడిచి, శిరిడీచేరి, బాబాతో మసీదునందుండసాగెను. ప్రజలు వాని తీపిమాటలకు మోసపోయిరి. అతను బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా యందుల కడ్డు చెప్పక శిష్యునివలెనే మసలుకొనెను.తరువాత గురుశిష్యులిద్దరూ రహతాకు పోయి యచ్చట నివశించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి యేమియు తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువుయొక్క లోపములు బాగాతెలియును. అయినప్పటికి బాబా ఆకపట గురువునెప్పుడు అగౌరవించక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు శిరిడీకి వచ్చి పోవుచుండెడివారు. కాని అధికముగా రహతాలోనే నివశించేవారు. శిరిడీలోని సాయిభక్తులకు బాబా ఆవిధముగ రహతాలో నుండుట ఎంతమాత్ర మిష్టములేకుండెను. అందుచే వారందరు కలసి సాయిబాబాను మరల శిరిడీకి పిలుచుకొనివచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్‌గా వద్ద బాబాను ఒంటరిగా చూచి, వారిని తిరిగి శిరిడీ తీసికొనిపోవుటకై వచ్చినామని చెప్పిరి. జవ్హర్ అలీ ముక్కోపి యనీ, ఆయన తనను విడిచిపెట్టడనీ, అందువలన వారు తన యందు ఆశ విడిచి, ఫకీరు అక్కడకు వచ్చులోపల, శిరిడీ మరలివెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జవ్హర్ అల్లీ అక్కడకు వచ్చి, బాబాను తీసికొని పోవుటకు ప్రయత్నించుచున్నశిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురుశిష్యులిద్దరూ తిరిగి శిరిడీ పోవుటకు నిర్ణయమైనది.

వారు శిరిడీ చేరి యచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపటగురువును పరీక్షించి యతని బండారము బయటబెట్టెను. చాంద్‌పాటిల్ పెళ్లి బృందముతో బాబా శిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే పదిపన్నెండేళ్ళ వయసులో దేవీదాసు శిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి, నిర్వ్యామోహితావతారమువలె జ్ఞానివలె కనపడుచుండెను. తాత్యాపాటీలు, కాశీనాధ్ షింపీ మొదలుగా గల యనేకమంది దేవీదాసును తమ గురువుగా భావించెడివారు. వారు జవ్హర్ ఆల్లీని దేవిదాసు వద్దకు తీసికొనివచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవ్హర్ ఆల్లీ చిత్తుగా యోడిపోయి, శిరిడీ నుండి పలాయనము చిత్తగించెను. అ తరువత యతడు వైజాపూరులో నుండి, చాల యేండ్ల తరువాత శిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సునుండి తొలగి, తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయి బాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలెనో, యెట్లు అహంకారమమకారములను విడిచి గురుశుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగ నిరూపించవలెను. ఈ కధ భక్తమహాల్సాపతి చెప్పిన వివరముల యాధారముగ వ్రాయబడినది.

అయిదవ అధ్యాయము
సంపూర్ణము
| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు|
|శుభం భవతు |









నాలుగవ అధ్యాయము

శ్రీ సాయినాథాయ నమః
శ్రీసాయిసచ్చరిత్రము
నాలుగవ అధ్యాయము

యోగీశ్వరుల కర్తవ్యము - పవిత్ర శిరిడీ క్షేత్రము - సాయిబాబా యొక్క రూపురేఖలు -
గౌలిబువాగారి వాక్కు - విఠల దర్శనము - క్షీరసాగారుని కథ - దాసగణు ప్రయాగాస్నానము -
సాయిబాబా అయోనిసంభవము - శిరిడీకి వారి మొదటి రాక - మూడు బసలు -
యోగీశ్వరుల
కర్తవ్యము

భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. "ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పాందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు, యుగయుగములందు అవతరించెదను. "ఇదియే భగవంతుని కర్తవ్యకర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు సన్యాసులు అవసరము వచ్చినపుడెల్ల అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారు తమకర్మలను మానునప్పుడు, శూద్రులు పైజాతులవారి హక్కులను అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక యవమానించునప్పుడు, ఎవరును మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని యనుకొనునప్పుడు, జనులు నిషిద్ధాహారములు మద్యపానముల కలవాటుపడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతములవారు తమలోతాము కలహించునప్పుడు, బ్రహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనదారాసంతానములే జీవిత పరమర్ధముగా భావించి మోక్షమర్గమును మరచునప్పుడు, యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయకర్మలచే ప్రజలను సవ్యమార్గమున బెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్తంభములవలె సహాయపడి, మనము నడువవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబయీ, నామదేవు, జానబాయి, గోరా, గోణాయీ, ఏకానాధుడు, తుకారాము, నరహరి, నర్సిబాయి, సజన్‌కసాయి, సాంవతమాలి, రామదాసు, మొదలుగాగల యోగులును, తదితరులును వేర్వేరు సమయములందుద్భువించి మనకు సవ్యమైన మార్గమును జూపిరి. అట్లే సాయిబాబా గూడా సకాలమందు శిరిడీ చేరిరి.

పవిత్ర శిరిడీ క్షేత్రము

ఆహమదునగరు జిల్లాలోని గోదావరినది ప్రాంతములు చాలా పుణ్యతమములు, ఏలయన నచ్చట ననేక యోగులుద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీజ్ఞానేశ్వర్ మహారాజ్. శిరిడీ గ్రామము అహమదు నగరు జిల్లాలోని కోపర్‌గాం తాలుకాకు చెందినది. కోపర్‌గాం వద్ద గోదావరి దాటి శిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్ గాంవ్ వచ్చును. అచ్చటికి శిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల గాణగాపురము, నరశింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రములవలె శిరిడీకూడ గొప్పగా పేరు గాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేఢ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢ మందు సమర్థరామదాసు, నర్సోబాచీవాడీయందు శ్రీనరసింహ సరస్వతీస్వామివార్లు వర్దిల్లినట్లే శ్రీసాయినాథుడు
శిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్ర మొనర్చెను.

సాయిబాబా రూపురేఖలు


సాయిబాబా వలననే శిరిడీ ప్రాముఖ్యము వహించినది సాయిబాబా యెట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవభక్తుల కిల్లువంటివారు; ఉదారస్వభావులు; సారములోని సారాంశమువంటివారు; నశించు వస్తువులందభిమానము లేనివారు; ఎల్లప్పుడు ఆత్మసాక్షాత్కారమందే మునిగియుండెడివారు; భులోకమందుగాని, స్వర్గలోకమందుగాని గల వస్తువులందభిమానము లేనివారు. వారి యంతరంగము అద్దమువలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి యమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు, వారికి సమానమే. వారు మానావమానాలను లెక్కించినవారు కారు. అందరికి వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి యుండెడివారు. ఆటలు గాంచెడివారు; పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితినుండి మరలువారు కారు. ఎల్లప్పుడు అల్లా నామము నుచ్ఛరించుచుండెడివరు. ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగానిద్రయందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి యంతరంగము లోతయిన సముద్రమువలె ప్రశాంతము. వారి యాశ్రమము, వారి చర్యలు ఇదమిత్థముగ నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండియున్నప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నియు వారికి తెలియును. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందలకొలది కథలు చెప్పునప్పటికిని మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడు మసీదుగోడకు ఆనుకొని నిలుచువారు. లేదా, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండీ తోటవైపుగాని చావడివైపుగాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి యుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకునివలె నటించువారు. అణకువ నమ్రత కలిగి,యహంకారము లేక యందరిని ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా, శిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళంది ను వృద్ధి చేసెను. శిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసికొన్నవి. ఏలయన బాబా పవిత్రపాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసికొనగలిగినవి. శిరిడీ మావంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశి, రామేశ్వరము, బడరీకేదార్,నాసిక్,త్ర్యంబకేశ్వరము. ఉజ్జయిని , మహాబలేశ్వరము , గోకర్ణములవంటిదయినది. శిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణతంత్రము. అది మాకు సంసారబంధముల సన్నగిలచేసి యత్మసాక్షాత్కారమును సులభసాధ్యము చేయును. శ్రీసాయి దర్శనమే మాకు యోగాసాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణీ ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మాకోరికలను నశింపజేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మాపాలిట శ్రీకృష్ణుడుగ, శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు; నిరుత్సాహముగాని ఉల్లసాముగాని యెరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానందస్వరూపులుగా నుండెడివారు. శిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడదేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా, భక్తు లన్నిదేశములనుండి శిరిడీ చేరి వారిని దర్శించి వారి యాశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్‌రఖుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేది యానందము శిరిడిలో దొరుకుచుండెడిది. ఇది యతిశయోక్తి కాదు. విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు.

గౌలిబువా అభిప్రాయము

95 సంవత్సరముల వయస్సుగల గౌలిబువా యను వృద్ధభక్తుడు ఒకడు పండరీయాత్ర ప్రతిసంవత్సరము చేయువాడు. ఎనిమిది మాసములు పండరీపురమందు, మిగత నాలుగు మాసములు -- ఆషాఢము మొదలు కార్తీకమువరకు(జులై - నవంబరు) -- గంగానది యొడ్డునను ఉండెడివాడు. సామాను మొయుటకొక గాడిదను, తోడుగా నొక శిష్యుని తీసికొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసికొని శిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ యిట్లనెడివాడు; "వీరు పందరీనాధుని యవతారమే! అనాధల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి!" గౌలిబువా విఠోబాదేవుని ముసలిభక్తుడు. పండరీయాత్ర యెన్ని సారులో చేసెను. వీరు సాయిబాబా పందరీనాధుని యవతారమని నిర్ధారణ పరచిరి.

విఠలదేవుడు దర్శనమిచ్చుట

సాయిబాబాకు భగవన్నామస్మరణయందును, సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు ' అల్లా మాలిక్' -- అనగా, 'అల్లాయే యజమాని' -- అని యనుచుండెడివారు. ఏడు రాత్రింబగళ్ళు భగన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేడి, "తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని, భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీ పురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము, ఇక్కడనే -- యనగా శిరిడీలోనే -- యున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే యవతరించును" అనెను.

సప్తాహము మునిగిన పిమ్మట విఠలుడీ క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్నహారతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా కాకాకు బాబా యిట్లడిగెను. "విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృడముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవును." ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25,30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని జూచి బాబామాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటము నొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను.

భగవంతరావు క్షీరసాగారుని కథ

విఠలపూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగారుని కధలో విశదీకరింపబడినది. భగవంతురావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీ పురమునకు నియమముగ యాత్ర చేయుచుండెడివాడు. ఇంటివద్ద కూడా విఠోబా ప్రతిమనుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు శిరిడీ వచ్చినప్పుడు, బాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకొని; "వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మాడ్చినాడు. అందుచేత వీని నిక్కడకు తెచ్చితిని. వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను," అనిరి.

ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము

గంగానది యమునానది కలియుచోటునకు ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచటికి పోయి స్నానమాడుదురు. దాసగణు కుడా ప్రయాగ పోయి అచ్చట సంగమములో స్నానము చేయవలెనని మనస్సున దలచెను. బాబా వద్దకేగి యనుమతించమనెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. " అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ యిచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము." ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటె నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగణు మహారాజ్ బాబా పాదములపై శిరస్సునుంచిన వెంటనే బాబా రెండుపాదముల బొటన వ్రేళ్ళనుండి గంగాయమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి
దాసగణు ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో వుప్పొంగిన కవితావేశం శ్రీసాయీలీలాగానరూపంలో పెళ్లుకుబికింది.

బాబా అయోనిసంభవుడు;శీరిడీ మొట్టమొదట ప్రవేశించుట

సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని జన్మస్థానమును గూర్చిగాని యెవరికి ఏమియు తెలియదు. ఎందరో పెక్కుసారులీ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లీ విషయముగ బాబాను ప్రశ్నించిరి గాని, యెట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు, సమాన్యమానవులవలె జన్మించియుండలేదు. ముత్యపుచిప్పలలో చిన్న పాపలవలె లభించిరి. నామదేవుడు భీమారధి నదీతటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరధీనదీతటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా ప
దునారేళ్ళ బాలుడుగా శీరిడీలోని వేపచెట్టు క్రింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. బాబా స్వప్నావస్థయందయినను ప్రపంచవస్తువులను కాంక్షించెడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్‌దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది. "ఈ చక్కని చురుకైన కుఱ్ఱవాడు వేపచెట్టుక్రింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపక యంతటి చిన్న కుఱ్ఱవాడు కఠినతపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్ధులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రియందెవరికి భయపడువాడు కాడు. చూచినవారాశ్చర్య నిమగ్నులై యీ చిన్నకుఱ్ఱ వాడెక్కడనుండి వచ్చినాడని యడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాల అందముగా నుండెను. చూచినవారేల్లరు ఒక్కసారిగా ముగ్దులగుచుండిరి. ఆయన ఎవరి యింటికి పోకుండెను, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్నబాలునివలె గాన్పించినప్పటికిని చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతని గూర్చి యెవరికి నేమి తెలియకుండెను." ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా నీ బాలు డెవడయి యుండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రు లెవరని, ఎచ్చటినుండి వచ్చినాడని యడిగిరి. ఆ ఖండోబా గాణము యొక స్థలమును చూపి, గడ్డపారను దీసికొని వచ్చి యచ్చట త్రవ్వుమనెను. అట్లు త్రవ్వగా నందులో కొన్ని నిటుకలు. వాని దిగువ వెడల్పు రాయి యొకటి గాన్పించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు గాన్పించెను. అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను. ఆసొరంగము ద్వారా ముందుకుపోగా నచ్చట నొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కఱ్ఱబల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు నభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుఱ్ఱవాని నీ విషయము ప్రశ్నించగా, వారలను మరపించుచు అది తన గురుస్ధానమనియు, వారి సమాధి యచ్చట గలదు గావున దానిని కాపాడవలెననియు చెప్పెను. వెంటనే దాని నెప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షములవలె నీ వేపచేట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు. మహాల్సాపతి తదితర శిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగనమస్కారములు చేసెదరు.

మూడు వసతిగృహములు

వేపచేట్టును, దాని చుట్టునున్న స్థలమును హరివినాయక సాఠే అనువాడు కొని సాఠేవాడాయను నొక పెద్ద వసతిగృహమును గట్టించెను. అప్పట్లో శిరిడీకి పోయిన భక్తమండలికిది యోక్కటియే నివాసస్థలము. వేపచెట్టు చుట్టు ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన నొక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తరాభిముఖముగా కుర్చొనెదరు. ఎవరిచ్చట గురుశుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడా చాల పురాతనమైనది. కావున మరమ్మతునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానమువారు చేసిరి.

కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గ్రహము కట్టబడినది. న్యాయవాదియైన కాకాసాహెబు దీక్షిత్ ఇంగ్లండుకు బోయెను. అచ్చట రైలు ప్రమదమున కాలు కుంటుపడెను. అది యెంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కరు శిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా యిచ్చెను. 1909 వ సంవత్సరమున కాకా శిరిడీకి బోయెను. బాబా దర్శనమాత్రమున అమితానందభరితుడై శిరిడీలో నివశించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనముకన్న తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్ధించెను. తన కొరకును, ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడాను నిర్మించెను. 10-12-1910 వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను (1)దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. (2) చావడిలో శేజ్ (రాత్రి) ఆరతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడా పూర్తికాగానే 1911 వ సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి.

తరువాత, కోటీశ్వరుడును నాగపూరు నివాసియునగు బూటీ మరియొక పడ్డ రాతి మేడను నిర్మించెను. అతడు చాల ద్రవ్యము దీనికొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్ధకమయ్యెను. ఏలయన బాబాగారి భౌతికశరీర మందులో సమాధి చేయబడినది. దీనినే సమాధిమందిర మందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోట యుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్ళు పోయుట మొదలగునవి చేసెడివారు.

ఇట్లు మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక్క వసతిగృహము కూడ లేకుండెను. అన్నిటికంటె సాఠెవాడా మొదటి రోజులలో అందరికి చాలా ఉపకరించుచుండెను.
నాలుగవ అధ్యాయము
సంపూర్ణము


| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు |
|శుభం భవతు |



మూడవ అధ్యాయము

శ్రీ సాయినాథాయ నమః
శ్రీసాయిసచ్చరిత్రము

మూడవ అధ్యాయము
సాయిబాబా యనుమతి - వాగ్ధానము; భక్తులకు బాబా నియమించిన పనులు;
బాబా కధలు సముద్రమధ్యమున దీపస్తంభములు;
బాబా ప్రేమ - రోహిలా కధ; అమృతతుల్యములైన బాబా పల్కులు.
సాయిబాబా యొక్క యనుమతియు, వాగ్ధానమును


వెనుకటి యధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీసాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి యనుమతినొసంగుచు ఇట్లు నుడివిరి: "సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవునిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించి పోవును. శ్రద్ధాభక్తులతో వానిని వారికి ప్రపంచమందు వ్యామోహముక్షీణించును. బలమైన ప్రేమభక్తి కెరటములు లేచును. ఎవరయితే నా లీలలూ మునిగెదరో వారికిజ్ఞానరత్నములు లభించును."

ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగుననుధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే(శ్యామా) వైపు తిరిగి బాబా యిట్లనెను:.

"ప్రేమతో నా నామమునుచ్ఛరించిన వారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారినన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా నాధారపడియున్నారో వారీ కధలువినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయువారికంతులేని యానందమునుశాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరయితే నన్ను శరణు వేడెదరో, భక్తివిశ్వాసములతో నన్నుపుజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో, వారినిదుఃఖబంధనములనుండి తప్పింతును. ప్రాపంచిక విషయములనన్నింటినీ మరచి, నా నామమునేజపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను, చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడు నన్నుజ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచవిషయములం దెట్లు తగులుకొందురు? వారిని మరణమునుండిబయటకు లాగెదను. నా కధలు వినినచో సకలరోగములు నివారింపబడును. కావున భక్తిశ్రద్ధలతో నా కధలనువినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తులయొక్కగర్వాహంకారములు నిష్కమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైననమ్మకము గలవారికి శుద్దచైతన్యముతో తాదాత్మ్యము కలుగును. 'సాయి సాయి' . యను నామమునుజ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడుపలుకుటవలన, వినుటవలన కలుగు పాపములుతొలగిపోవును."

భక్తులకు వేర్వేరు పనులు నియమించుట

భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాయములు, మఠములు, తీర్ధములలో నదివొడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నయమితు లగుదురు. భగవంతుని లీలలనుపాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్ధయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకునియమింపబడినది. విషయజ్ణానము శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది. అయినచో, యింతకఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవితచరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయియొక్క కరుణయే యింత కఠినకార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కాలముపట్టుకొనగనే సాయిబాబా నా యహంకారమును పరిహరించి, వారి కధలను వారే వ్రాసికొనిరి. కనుక గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకు గాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని శ్రుతిస్మృతి యను రెండు కండ్లు లేకుండుటచే సాయిసచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని . కాని భగవంతునిఅనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చేయును; కుంటివానిని పర్వతము దాటునట్లు చేయును.తనయిచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము భగవంతునికే గలదు. హార్మోనియమునకుగానివేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియును. చంద్రకాంతము ద్రవించుట, సముద్రముప్పొంగుట వానివానివల్ల జరుగవు. అవి చంద్రోదయము వల్లజరుగును.

బాబా కథలు దీపస్తంభములు

సముద్రమధ్యమందు దీపస్తంభము లుండును. పడవలపై పోవువారు వెలుతురుతో రాళ్ళు రప్పలవల్లకలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసముద్రములోబాబాకధలను దీపములు దారి చూపును. అవి అమృతముకంటే తియ్యగానుండి ప్రపంచయాత్ర చేయుమార్గమును సులభముగను, సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మనచెవులద్వారా హృదయమందు ప్రవేశించునప్పుడు శరీరస్పృహయును,అహంకారమును, ద్వంద్వభావములును నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములుపటాపంచలయిపోవును. శరీరగర్వము మాయమై పోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడును. శ్రీసాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టియివియే మోక్షమునకు సులభసాధనములు కృతయుగములో శమదమములు (అనగా నశ్చలమనస్సు, శరీరము) త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలనునామములను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణములవారు చివరి సాధనమునుఅవలంచించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణముఅవలంభించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట యతి సులభము. మనననస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్కథలను వినుటవలన పాడుటవలన మనకుదేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా జేసి, తుదకు ఆత్మసాక్షాత్కారముపొందునట్లు చేయును. కారణము చేతనే సాయిబాబా నాకు సులభముగా చదువగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను థ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననముచేసికొనవచ్చును. ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును. తుదకుప్రపంచమందు విరక్తిపొంది యాత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారుచేయుట బాబాయొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడుగనే యుంటిని.

సాయిబాబా యొక్క మాతృప్రేమ

ఆవు తన దూడనెట్లు ప్రేమించునో యందరికి తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడు నిండియే.యుండును. దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లిగ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లితగిన శ్రద్ధ తీసికొని సరిగా చేయును. బిడ్డకు విషయమేమియు తెలియదుగాని, తల్లి తన బిడ్డలు చక్కగాదుస్తులు ధరించి యలంకరింపబడుట చూచి యమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చ దాగినదేదియు లేదు. అది యసామాన్యము; నిర్వ్యాజము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందుచూపుదురు. సాయిబాబాకు గూడా నాయందట్టి ప్రేమ యుండెను. దానికీ క్రింద యుదాహరణ మొకటి.
1916 సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగమునుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛనుకుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురుపౌర్ణమినాడు ఇతరభక్తులతో నేను కూడా శిరిడీకిపోయితిని. అన్నా చించణీకర్ నాగురించి బాబాతో నిట్లనెను; "దయచేసి యీ అన్నాసాహెబ్ యందుదాక్షిణ్యము చూపుము. వానికి వచ్చుపింఛను సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైనఉద్యోగ మిప్పించుము. వాని యాతురతను తీసి, నిశ్చింతను గలుగచేయుము." అందులకు బాబా యిట్లుజవాబిచ్చెను: "వాని కింకొక ఉద్యోగమూ దొరుకును. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలెను. వానిభోజనపాత్రలు ఎప్పుడూ పూర్ణముగనే యుండును. అవి ఎన్నటికిని నిండుకొనవు. వాని దృష్టినంతటినినావైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరియెడల అణకువనమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందముపొందును.

నన్ను పూజింపుడనుదానిలోని 'నన్ను' అనగా ఎవరు? అను ప్రశ్నకు సమాధానము యీ గ్రంధముయొక్క ఉపోద్ఘాతములో 'సాయిబాబా ఎవరు' అనుశీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి యున్నది. చూడుడు!

రోహిలా కధ

రోహిలా కధ విన్నచో బాబా ప్రేమ యెట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కాతొడిగినవాడును, బలవంతుడునగు రోహిలా యొకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై శిరిడీలో స్థిరనివాసముఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురాను లోని కల్మాను చదువుచు, "అల్లాహు అక్బర్" యని యాబోతురంకెవేయునట్లు బిగ్గరగా నరచుచుండెను. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి యింటికివచ్చిన శిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళవరకు వారుదీనినోర్చుకొనిరి. తుదకు భాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరపుల నాపుమని బతిమాలిరి. బాబా వారిఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారిపనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిలా జోలికిపోవద్దని మదలించిరి. "రూహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు, ఆమె గయ్యాళి యనియు, ఆమెవచ్చి రోహిలను తనను బాధ పెట్టుచున్నదనియు, రోహిలా ప్రార్ధనలు విని ఆమె ఏమి చేయలేకఊరకయుండు" ననియు బాబా చెప్పెను. నిజముగా రోహిలకు భార్యయే లేదు. భార్యయనగా దుర్భుద్ధియనిబాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్ధనలయందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిలా తరపునవాదించి, ఊరిలోనివారి నోపికతో నోర్చుకొని అసౌకర్యమును సహింపవలసినదనియు, నది త్వరలోతగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను.

బాబా యొక్క యమృతతుల్యమగు పలుకులు

ఒకనాడు మధ్యాహ్న ఆరతి యయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడువారికి బాబా యీ క్రింది చక్కని యుపదేశమిచ్చిరి:"మీరెక్కడ నున్నాను, ఏమి చేయుచున్ననూ నాకుతెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించువాడను. అందరిహృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచరజీవకోటి నావరించియున్నాను. జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే, నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియచాలకుడను నేనే. సృష్టిస్థితిలయకారకుడను నేనే.ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారికేహానిగాని బాధగాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితరదృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే!"

చక్కని యమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో యే నౌకరీ కొరకు యత్నించక, గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకొంటిని. కాని, అణ్ణా చించణీకరు ప్రశ్నకు బాబా చెప్పినసమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా యని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగమూ దొరకెను. కాని అదికొద్దికాలము వరకే, అటుపిమ్మట వేరే పని యేదియు చేయక శ్రీసాయిసేవకు నా జీవితమంతయుసమర్పించితిని.

యధ్యాయమును ముగించబోవుముందు చదువరులకు నేను చెప్పునదేమన, బద్ధకము నిద్రచంచలమనస్సు దేహాభిమానము మొదలగు వానిని విడిచి, తమ యావత్తూ దృష్టిని సాయిబాబా కధలవైపుత్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురుగాక.
ఇతర మార్గము లవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును త్రొక్కుదురు గాక! అనగా శ్ర్రీసాయి కధలను విందురు గాక! ఇది వారి యజ్ఞానమును నశింపజేయును. మోక్షమును సంపాదించిపెట్టును. లోభి యెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు, బాబానుకూడా నెల్లరు తమ హృదయములందు స్ధాపించుకొందురుగాక!


మూడవ అధ్యాయము
సంపూర్ణము
| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు |
|శుభం భవతు |