4, జూన్ 2009, గురువారం

అయిదవ అధ్యాయము

శ్రీ సాయినాథాయ నమః
శ్రీసాయిసచ్చరిత్రము
అయిదవ అధ్యాయము
చాంద్ పాటీలు పెండ్లి బృందములో కలిసి బాబా తిరిగి శిరిడీ రాక: 'సాయి'యను నామము; ఇతర
యోగులతో సహవాసము; పాదుకల చరిత్ర: మొహియొద్దీన్ తో కుస్తీ; జీవితములో మార్పు;
నీళ్ళను నూనెగా మార్పుట; జవ్హర్ అల్లీ యను కపటగురువు.
పెండ్లివారితో కలసి బాబా తిరిగి శిరిడీకి వచ్చుట

ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహామ్మదీయు దొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుఱ్ఱము తప్పిపోయెను. రెండుమాసములు వెదకినను దానియంతు దొరకకుండెను. అతడు నిరాశచెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదునుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారొక తొమ్మిది మైళ్ళు నడచిన పిమ్మట నొక మామిడిచెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చొనియుండెను. అతడు తలపై టోపీ పొడగైన చొక్కా ధరించియుడెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నిచుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును జూచి, అతనిని బిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి గొనుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుఱ్ఱముదని చంద్ పాటీల్ బదులు చెప్పను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెదకుమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుఱ్ఱమును చూచి మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణమనుజుడు కాడనియు గొప్ప ఔలియా(సిద్ధపురుషుడు) అయియుండవచ్చు ననియు అనుకొనెను. గుఱ్ఱమును దీసికొని ఫకీరువద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చ్చాపీ(గుడ్డ ముక్క) నా నీటితో తడిపి, నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి, తరువాత చాంద్ పాటీలు కందించెను. ఇదంతయు జూచి చాంద్ పాటీలు ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిధిగా రమ్మని చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటిదినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి యచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది శిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నియు చేసికొని పాటీలు శిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లివారితో కలసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్లిరి గాని ఫకీరు మాత్రము శిరిడీలో ఆగి, యచ్చటనే స్థిరముగా నిలిచెను.

ఫకీరుకు 'సాయి' నామ మెట్లు వచ్చెను?

పెండ్లివారు శిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున నున్న భక్త మహల్సాపతిగారి పొలములో నున్న మఱ్ఱిచెట్టు క్రింద బస చేసిరి. ఖండోబామందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్నవారొకరి తరువాత నొకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును జూచి భక్త మహాల్సాపతి, "రండి సాయీ!"యన్ని స్వాగతించెను. తక్కినవారు గూడా ఆయనను 'సాయి' యని పిలువనారంభించిరి. అది మొదలు వారు 'సాయిబాబా' గా ప్రఖ్యాతులైరి.

ఇతరయోగులతో సహవాసము

సాయిబాబా శిరిడీలో నొక మసీదులో నివాస మేర్పరచుకొనిరి. బాబా శిరిడీకిరాక పూర్వమే దేవీదాసు అను యోగి శిరిడీలో ఎన్నోసంవత్సరములనుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను. అతనితో కలసి కొంతకాలము మారుతీ మందిరములోను, చావడిలోను నుండెను. కొంతకాల మొంటరిగా నుండెను. అంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి యచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు జానకీదాసు పోవుచుండెను. అటులనే, పుణతాంబే నుండి యొక వైశ్యయెగి శిరిడీ వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు; పేరు గంగాగీరు. ఒకనాడు, బాబా స్వయముగా కుండలతో నీళ్ళు తెచ్చి పూలచెట్లకు పోయుచుండుట జూచి అతడు శిరిడీ గ్రామస్థులతో నిట్లనెను. "ఈ మణి యిచ్చటుండుటచె శిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయనీనాడు కుండలతో నీళ్ళు మోయుచున్నడు. కాని యితడు సామాన్యమానవుడు కాడు. ఈ నేల నిజముగ పుణ్యము చేసికొనినది. కనుకనే సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొనగలిగెను" ఏవలా గ్రామములో నున్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడొకనాడు శిరిడీ గ్రామనివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి యిట్లనెను. "ఈయన యొక యమూల్యమైన రత్నము. సామాన్యమానవుని వలె గాన్పించునప్పటికిని ఈయన మామూలు రాయివంటివాడు కాదు. ఈయనొక యమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. " ఇట్లనుచు ఆనందనాధుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యౌవ్వనమున జరిగిన సంగతి.

బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు

యౌవనమునందు బాబా తమ తలవెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుడెను. పహిల్వానువలె దుస్తులు వేసికొనెడివారు. శిరిడీకి మూడుమైళ్ళ దూరములో నున్న రహతాకు పోయినప్పుడొకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి, నేలను చదును చేసి, వానిని నాటి, నీళ్లూ పోయుచుండిరి. అనుదినము వామన్ తాత్యా యను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగ బావినుండి నీళ్ళు ఫోయిచుండిరి.అనుదినము వామన్ తాత్యా యను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగ బావినుండి నీళ్లు చేది, ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి, భుజముఫై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలము అ కుండలను వేపచెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వేంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండెడివి. ఇట్లు మూడు సంవత్సరములు గడచెను. సాయిబాబా కృషివలన అచ్చట నొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే యిప్పుడు బాబా సమాధి యున్నది. దానినే సమాధి మందిర మందురు. దానిని దర్శించుట కొరకే యనేకమంది భక్తులు విశేషముగా పోవుచున్నరు.

వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము

అక్కల్‌కోటకర్ మహరాజ్ గారి భక్తుడు భాయికృష్ణజీ అలీబాగ్‌కర్. ఇతడు అక్కల్‌కోటకర్ మహరజ్ గారి చిత్రపటమును పూజించెడివాడు. అతడొకప్పుడు షోలాపూరు జిల్లాలోని
అక్కల్‌కోట గ్రామమునకు పోయి, మహరాజ్ గారి పాదుకలు ర్శించి పూజించవలెనని యనుకొనెను. అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో ఆ మహరాజ్ దర్శననిచ్చి యిట్లు చెప్పెను; "ప్రస్తుతము శిరిడీ నా నివాసస్థలము అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము!" అందుచే, అక్కల్‌కోట పోవలెనను తన నిర్ణయమును మార్చుకొని భాయికృష్ణజీ శిరిడీ చీరి, బాబాను పూజించి, అచ్చటనే ఆరు మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్ధము పాదుకలు చేయించి శ్రావణమాసములో నొక శుభదినమున వేపచెట్టుక్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సం || 1834, శ్రావణ మాసములో (అనగా,క్రీ.శ. 1912 లో) జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీబాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ యను బ్రాహ్మణుడు పాదుకల నిత్యపూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణ్ మేరు నాయక్ నకప్పగించబడినది.

ఈ కధయొక్క పూర్తి వివరములు

ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బి.వి.దేవు బాబాకు గొప్ప భకుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేపచెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నియు సగుణ్‌మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షిత్ ల నుండి సేకరించి, పాదుకల పూర్తి వృత్తాంతము, శ్రీసాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము, మొదటి సంచిక, 25 వ పేజేలో నీరీతిగా ప్రచురించినారు.
1912వ సంవత్సరములో బొంబాయినుండి డాక్టరు రామారావు కొఠారెయను నతడు శిరిడీ వచ్చెను. వానితో బాటుగ అతని కంపౌండర్ ను, మరియు అతని మిత్రుడైన భాయికృష్ణజీ అలీబాగ్‌కర్ అనునతడును వెంటవచ్చిరి. శిరిడీలో వరు
సగుణ్‌మేరు నాయక్ కు జి.కె.దీక్షిత్ కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనునప్పుడు సంభాషణ వశాత్తు, బాబా ప్రప్రధమమున శిరిడీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తవస్సు చేసిన దాని జ్ణాపకార్ధము బాబా పాదుకలు ఆ వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టరు రామారావు కొఠారేకు దెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయికృష్ణజీ మిత్రుడైన కంపౌండర్ సలహానిచ్చెను. అందరును యీ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టరుగారికి ఈ విషయము తెలియపరచిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహరాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను జూపిరి. శ్రీ ఉపాసనీ దానిలో కొన్ని మార్పులను జేసి, పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి, బాబా యోగశక్తిని వేపచెట్టు గొప్పతనమును దెలుపు యీ క్రింది శ్లోకమును కూడ చెక్కించమనిరి;


సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధా స్రావిణం తిక్తమప్యప్రియం తమ్ |
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్||


ఉపాసనీ సలహాల నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి, కంపౌండరు ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమినాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జి.కె.దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరమునుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా యా పాదుకలను స్పృశించి, అవి భగమంతుని పాదుకలని నుడివెను. వానిని వేపచెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని యాదేశించెను. ఆ ముందురోజు బొంబాయి నుండి పాస్తాసేట్ యను పార్సీ భక్తుడొకడు మనియార్డరు ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా యా పైకము పాదుకాప్రతిష్ఠకగు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జి.కె.దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖ్‌డె యను బ్రాహ్మణుడు( నానుమామా పూజారి) పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారె దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టు కంచెకూడ పంపెను. ఈ కంచెయు, పైకప్పును కోపర్‌గాం స్టేషన్ నుండి శిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు సగుణ్‌మేరు నాయక్ ఇచ్చెను. (ప్రస్తుతము జాఖ్‌డె పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు)

మొట్టమొదట భాయికృష్ణజీ,
అక్కల్‌కోటకర్ మహారాజ్ భక్తుడు, 1912 వ సంవత్సరములో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించునప్పుడు అక్కల్‌కోటకర్కు పోవుచు మార్గమధ్యమున శిరిడీయందు దిగెను. బాబ దర్శనము చేసిన తరువాత అక్కల్‌కోట గ్రామమునకు పోవలెనను కొని బాబావద్దకేగి యనుమతి నిమ్మనెను. బాబా యిట్లనెను. "అక్కల్‌కోటలో నేమున్నది? అక్కడకేల పోయెదవు? అక్కడుండే మహరాజ్ ప్రస్తుతమిక్కడనే యున్నారు. వారే నేను." ఇది విని భాయికృష్ణజీ అక్కల్‌కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు శిరిడీ యాత్ర చేసెను.

హేమాడ్ పంతునకీ వివరములు తెలిసియుండవు. తెలిసియున్నచో సచ్చరిత్ర లో వ్రాయుట మానియుండరు.

మొహియొద్దీన్ తంబోలితో కుస్తీ -- జీవితములో మార్పు

శిరిడీ గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియొద్దీన్ తాంబోళి యనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా యోడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు రీతిని మర్చుకొనెను. లంగోటి బిగించుకొని ( ఫకీరులు ధరించు) పొడవాటి చొక్క(కఫ్నీ) ని తొడిగికొని, నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునెడివారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందెడివారు. రాజ్యభోగముకంటె దారిద్ర్యమే మేలని నుడివెడువారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడ కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా యతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయములో "దేహమును దమించి, దేవుని సహవాసము చేయమ'ని యొక యశరీరవాణి యతనికి వినిపించెను. అప్పటినుండి గంగాగీరు సంసారము విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణాతాంబే దగ్గర నది యొడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను.

సాయిబాబా జనులతో కలిసిమెలసి తిరిగెడివారు కారు; ఎవ్వరితోను తమంతటతాము మాట్లాడెడివారు. ఎవరైన యేదైన అడిగిన యాయడిగినదానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో యెక్కువ భాగము వేపచెట్టునీడయందు, అప్పుడప్పుడు యూరవతలనున్న కాలువ యొడ్డునగల తుమ్మచెట్టు నీడన కూర్చొనెడివారు. సాయంకాల మూరకనే కొంతదూరము నడిచెడివారు; ఒక్కొక్కసారి నీమ్‌గాం పోవుచుండెడివారు. నీమ్‌గాంలో బాబాసాహెబ్ త్ర్యంబక్‌జీ డేంగలే యనునతని యింటికి తరుచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగలేయందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు రెండు వివహములు చేసికొన్నను సంతానము కలుగులేదు. బాబాసాహెబు డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబాయనుగ్రాహముచే నానాసాహెబునకు పుత్రసంతానము కలిగెను. అప్పటినుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి యంతటను వెల్లడి యాయెను. అహమద్ నగరు వరకు వ్యాపించెను. అక్కడనుంచి నానాసాహెబు చందోర్కరు, కేశవ్ చిదంబర్ మొదలుగాగల యనేకయంది శిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. రాత్రులందు బాబాపాడుపడిన పాతమశీదునందు శయనించుచుండెను. పొగపీల్చుకొను 'చిలిం' గొట్టము, కొంత పోగాకు, ఒక రేకు డబ్బా, కఫ్నీ, తలగుడ్డ, ఎల్లప్పుడు దగ్గరనుంచుకొను 'సటకా"(చిన్న చేతికర్ర) మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపై నొక గుడ్డను చుట్టి, దాని అంచులను హడవలె మెలిబెట్టి ముడివేసి, యెడమచెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతుకకుండ నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు. (కఫ్నీ క్రింద) లంగోటీ కట్టుకొనెడివారు. చలిని కాచుకొనుటకు ధుని కెదురుగా(మసీదు ఈశాన్యభాగములో గల) కొయ్య చేపట్టుపై తమ యెడమచేతినానించి, దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో ఆహంకారమును, కోరికలను, అలోచనలను ఆహుతి చేసి "అల్లాయే యజమాని" అని పలికేవారు. మసీదులో రెండు గదుల స్థలము మాత్రముండెను. భక్తులందరు అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్నిమార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపన చేసిరి. బాబా యీ మసీదుకు రాకపూర్వము 'తకియా'(రచ్చ) లో చాలాకాలము నివసించిరి. బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు; భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు.

నీళ్లను నూనెగా మార్చుట

సాయిబాబాకు దీపములన్న చాల యిష్టము. ఊరిలో నూనెను విక్రయించు షాహుకార్లను నూనె యడిగి తెచ్చి మసీదునందు రాత్రియంతయు దీపములు వెలిగించు చుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణాదారులందరు కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగానూనె లేదనిరి. బాబాకలత జెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టియుంచెను. నూనెవ్యాపారులు ఆసక్తితో నిదంతయు గమనించు చుండిరి. అడుగున రెండుమూడు నూనెచుక్కలు మిగిలియున్న తమ రేకుడబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట, మరల డబ్బాతో నీరు తీసికోని, యా నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణాదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నియు తెల్లవారుదాక చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు జూచి యా షాహుకార్లు పశ్చాత్తాపపడి, బాబాను మన్నింపు కొరిరి. బాబా వారిని క్షమించి, ఇకపైనైననూ సత్యము నంటివట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి.

జౌహర్ అలీ యను కపటగురువు

పైన వివరించిన కుస్తీ జరిగిన యయిదేండ్ల తరువాత అహమదునగ
రు నుండి జవ్హర్ అల్లీ యను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్రమందిరమునకు సమీపమున నున్న స్థలములో దిగెను. ఆ పకీరు బాగా చదువుకొన్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధురభాషణుడు. ఆ యూరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడి వారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా "ఈద్ గా" యను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్ధించు గోడయే 'ఈద్‌గా'. ఈ విషయములో వివాదములేచి, అది ఘర్షణలకు దారితీసెను. దానితో జవ్హర్ అల్లీ రహతా విడిచి, శిరిడీచేరి, బాబాతో మసీదునందుండసాగెను. ప్రజలు వాని తీపిమాటలకు మోసపోయిరి. అతను బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా యందుల కడ్డు చెప్పక శిష్యునివలెనే మసలుకొనెను.తరువాత గురుశిష్యులిద్దరూ రహతాకు పోయి యచ్చట నివశించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి యేమియు తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువుయొక్క లోపములు బాగాతెలియును. అయినప్పటికి బాబా ఆకపట గురువునెప్పుడు అగౌరవించక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు శిరిడీకి వచ్చి పోవుచుండెడివారు. కాని అధికముగా రహతాలోనే నివశించేవారు. శిరిడీలోని సాయిభక్తులకు బాబా ఆవిధముగ రహతాలో నుండుట ఎంతమాత్ర మిష్టములేకుండెను. అందుచే వారందరు కలసి సాయిబాబాను మరల శిరిడీకి పిలుచుకొనివచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్‌గా వద్ద బాబాను ఒంటరిగా చూచి, వారిని తిరిగి శిరిడీ తీసికొనిపోవుటకై వచ్చినామని చెప్పిరి. జవ్హర్ అలీ ముక్కోపి యనీ, ఆయన తనను విడిచిపెట్టడనీ, అందువలన వారు తన యందు ఆశ విడిచి, ఫకీరు అక్కడకు వచ్చులోపల, శిరిడీ మరలివెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జవ్హర్ అల్లీ అక్కడకు వచ్చి, బాబాను తీసికొని పోవుటకు ప్రయత్నించుచున్నశిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురుశిష్యులిద్దరూ తిరిగి శిరిడీ పోవుటకు నిర్ణయమైనది.

వారు శిరిడీ చేరి యచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపటగురువును పరీక్షించి యతని బండారము బయటబెట్టెను. చాంద్‌పాటిల్ పెళ్లి బృందముతో బాబా శిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే పదిపన్నెండేళ్ళ వయసులో దేవీదాసు శిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి, నిర్వ్యామోహితావతారమువలె జ్ఞానివలె కనపడుచుండెను. తాత్యాపాటీలు, కాశీనాధ్ షింపీ మొదలుగా గల యనేకమంది దేవీదాసును తమ గురువుగా భావించెడివారు. వారు జవ్హర్ ఆల్లీని దేవిదాసు వద్దకు తీసికొనివచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవ్హర్ ఆల్లీ చిత్తుగా యోడిపోయి, శిరిడీ నుండి పలాయనము చిత్తగించెను. అ తరువత యతడు వైజాపూరులో నుండి, చాల యేండ్ల తరువాత శిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సునుండి తొలగి, తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయి బాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలెనో, యెట్లు అహంకారమమకారములను విడిచి గురుశుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగ నిరూపించవలెను. ఈ కధ భక్తమహాల్సాపతి చెప్పిన వివరముల యాధారముగ వ్రాయబడినది.

అయిదవ అధ్యాయము
సంపూర్ణము
| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు|
|శుభం భవతు |









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి